శ్రమలో దాగిన స్వర్ణం

శ్రమలో దాగిన స్వర్ణం

February 1, 2019 Off By nuzvidthemangocity

అమరావతి నగరంలో శివయ్య అనే వ్యవసాయ కూలీ ఉండేవాడు. ఒకరోజు పొరుగు గ్రామంలో పూరి ఇల్లు కప్పే పని పూర్తి చేసుకుని అమరావతికి బయలుదేరాడు శివయ్య. వస్తుంటే పొలిమేరల్లో ఉన్న సదానందుని ఆశ్రమానికి వెళ్లాడు. అప్పుడే సంధ్యావందనం పూర్తి చేసుకుని వచ్చిన సదానందుడు, శివయ్యను చూస్తూ ‘ఏం నాయనా! ఇలా వచ్చావు’ అన్నాడు. 
‘స్వామీ! నేను ఉన్నంతలో నా సాటి వారికి సాయపడుతూనే వచ్చాను. అటువంటి నాకు ఇంత కష్టతరమైన జీవితమా? తప్పుడు దారిన పయనిస్తూ నా కళ్లముందే ఎందరో ధనవంతులుగా మారారు. ఇదేమి న్యాయం?’ అన్నాడు శివయ్య. 
‘నాయనా! అధర్మం తాత్కాలికంగా విజయం సాధించినా నీతి, నిజాయతీ, సత్యం చివరికి విజయం పొందుతాయి. నేను నీకు చేయగలిగిన సాయం ఏదైనా చేస్తాను నీ కోరికేంటో చెప్పు’ అన్నాడు సదానందుడు. 
‘స్వామీ! నా కష్టంతో బంగారుమయమైన జీవితం లభించే మార్గం చెప్పండి. మీరు చూపించిన మార్గాన్ని అనుసరిస్తా.’ అన్నాడు శివయ్య. క్షణకాలం ఆలోచించిన సదానందుడు తన కుటీరంలోకి వెళ్లి మూతిభాగం గుడ్డతో కప్పిన ఓ రాగి చెంబు తెచ్చి శివయ్య చేతికి ఇస్తూ ‘నాయనా! ఇందులో 96 రాగి నాణాలున్నాయి. నువ్వు కష్టపడి కూడబెట్టిన నాలుగు బంగారు నాణాలు ఈ చెంబులో వేసి ఎప్పటిలా గుడ్డ కట్టి తర్వాతి రోజు ఉదయం ఈ చెంబు నేలపై బోర్లించి చూడు వంద బంగారు నాణాలు కనిపిస్తాయి. అలా జరగలేదంటే నీ శ్రమలో ఏదో లోపం ఉన్నట్లు. అప్పుడు మరో నాలుగు బంగారు నాణాలు సంపాదించి ఈ రాగి చెంబులో వేస్తే తప్పకుండా నీ బతుకు బంగారుమయం అవుతుంది.’ అన్నాడు 
సదానందుడు. 
సదానందుని మాటలకు సంతోషించిన శివయ్య అతనికి వందనం చేసి తన ఇంటికి చేరుకున్నాడు. మరుసటి రోజు నుంచి శివయ్య తన సంపాదనంతా జాగ్రత్తగా పదిల పరచసాగాడు. రేయింబవళ్లు శ్రమిస్తూ రెండు సంవత్సరాల కాలంలో నాలుగు బంగారు నాణాలు సంపాదించి రాగి చెంబులో వేసి ఆ రాత్రి ప్రశాంతంగా సంతోషంగా నిద్రపోయాడు. తెల్లవారుతూనే స్నానం చేసి భగవంతుని ప్రార్థించి చెంబులోని నాణాలను గుమ్మరించాడు. శివయ్య చెంబులో వేసిన నాలుగు బంగారు నాణాలు తప్ప మిగిలినవన్నీ రాగి నాణాల్లానే ఉన్నాయి. అప్పుడు శివయ్యకు ‘నీ శ్రమలో ఏదైనా లోపం ఉంటే ఈ రాగి నాణాలు బంగారు నాణాలుగా మారవు’ అన్న సదానందుడి మాటలు గుర్తొచ్చాయి. 
తనకు తెలియకుండా తన శ్రమలో ఎక్కడో లోపం జరిగిందని చింతించాడు శివయ్య. గతంలో కన్నా పట్టుదలగా శ్రమించి కొంత కాలానికి మరో నాలుగు బంగారు నాణాలు సంపాదించి ఈ నాలుగు బంగారు నాణాలు రాగి చెంబులో వేసి మరుసటి రోజు చూశాడు. తను వేసిన ఎనిమిది బంగారు నాణాలు తప్ప చెంబులో ఉన్న రాగి నాణాల్లో ఎలాంటి మార్పూ రాలేదు. ఆశ్చర్యపోయిన శివయ్య రాగి చెంబు తీసుకుని సదానందుని ఆశ్రమం చేరి ‘స్వామీ! మీరు చెప్పినట్లే ముందు నాలుగు బంగారు నాణాలు ఈ చెంబులో వేశా. కానీ చెంబులోని రాగి నాణాల్లో ఎటువంటి మార్పు రాలేదు. మీరు చెప్పినట్లే నా శ్రమలో ఏదైనా దోషం ఉందా అని మరోసారి నాలుగు బంగారు నాణాలు గడించి రెండోసారి ప్రయత్నించి చూశా. నా ఎనిమిది బంగారు నాణాలు తప్ప చెంబులోని రాగి నాణాల్లో ఎటువంటి మార్పు రాలేదు ఎందుకు ఇలా జరిగింది?’ అన్నాడు. 
చిరునవ్వుతో సదానందుడు ‘నాయనా! ఎక్కడైనా మంత్రాలకు చింతకాయలు రాల్తాయా? మాయలతో ఎవరూ ధనవంతులు కాలేదు. అలా ఎవరైనా ఈ లోకంలో ధనవంతులయ్యారా? నీ శ్రమలోనే దాగి ఉంది స్వర్ణం. అది తెలియజేయాలనే అలా చెప్పా. పట్టుదలతో శ్రమించి ఎనిమిది బంగారు నాణాలు సంపాదించావు. ఈ బంగారు నాణాలతో వ్యవసాయ భూమి కొనుగోలు చేయి. అందులో ఎప్పటిలా శ్రమించు. బంగారు పంటలు పండించు. న్యాయ మార్గాన కొద్ది కాలంలోనే నువ్వు కోరుకున్నంత బంగారం నీ ఇంటికి వస్తుంది. ఇప్పటికైనా మనిషి శ్రమలో బంగారం దాగి ఉందని తెలుసుకో. సంపాదించిన దాంట్లో నీ అవసరాలకు పొదుపుగా వాడుకో. రేపటి అవసరాలకు దాచుకో’ అన్నాడు సదానందుడు.

76 total views, 3 views today