ప్రకృతి గొప్పతనం!

ప్రకృతి గొప్పతనం!

February 1, 2019 Off By nuzvidthemangocity

చంద్రపాలెం అనే ఊరిలో దొరబాబు అనే రైతు ఉండేవాడు. చక్కటి ఇల్లు కట్టుకుని భార్యాపిల్లలతో జీవించేవాడు. అతని ఇంటి పక్కన చాలా ఖాళీ స్థలం ఉండటంతో ఇంటి చుట్టూ పూల మొక్కలతో పాటు మామిడి, సపోటా, నేరేడు, నారింజ, అరటి వంటి పండ్ల చెట్లను పెంచాడు.
ఇంటి అవసరాలకు పోనూ ఎక్కువగా ఉన్న పండ్లు సంతలో అమ్మేవాడు. కాలానుగుణంగా ఫలసాయం అందేది.
పొరుగు గ్రామమైన ఇంద్రపాలెంలో అతని తమ్ముడు వీరబాబు ఉండేవాడు. అతనికి పొలంతో పాటు పెద్ద ఇల్లు కూడా ఉండేది అన్నగారి లాగే. ఒకసారి అన్నగారిని చూడాలని చంద్రపాలెం వచ్చాడు.
అన్నగారి పెరడు పూల మొక్కలతో పాటు, ఫలవృక్షాలతో కళకళలాడటమే కాదు.. ఆదాయాన్ని ఇచ్చేదిగా ఉండటం గమనించాడు.
తమ ఇంట్లోనూ ఉన్న ఖాళీ స్థలాన్ని అలాగే వదిలేశాడు. అప్పుడు దాన్నీ ఉపయోగానికి తేవాలని, తను కూడా అన్నగారిలాగే, పండ్ల మొక్కలు నాటాలనుకున్నాడు.
‘అన్నయ్యా! నీ ఇంటి పక్కన ఉన్న తోట చూస్తే ముచ్చటగా ఉంది. ఇప్పుడు నాకూ నీలాగే ఇంటి పెరట్లో మొక్కలు పెంచాలని ఉంది. ఏదైనా ఒక పండ్ల మొక్కను ఇచ్చావంటే పెంచుకుంటాను’ అన్నాడు.
అందుకు అన్నగారు తన దగ్గరున్న ఒక మామిడి మొక్కను తమ్ముడికి  ఇస్తూ ‘ఇది రసాల మామిడి. చక్కగా పెంచితే సంవత్సరంలో కాపుకి వస్తుంది’ అని చెప్పాడు.
వీరబాబు ఆ మొక్కని తన స్థలంలో నాటాడు. అది దినదినాభివృద్ధి చెంది ఏపుగా ప్రహరీగోడ ఎత్తుకి పెరగసాగింది. రోజూ చెట్టుని చూసి సంతోషపడుతున్న వీరబాబుకి ఒక అనుమానం పట్టుకుంది. కొద్దిరోజుల్లో ఇది కాపుకి వస్తుంది.
తమ ఇంటి పక్క నుంచి వెళ్లే వాళ్ల దృష్టి దీని మీద పడి కాయలు దక్కకుండా పోతాయేమోననిపించింది. అంతే, చెట్టు పక్కగా ఉన్న ఇంటి ప్రహరీ గోడను బాగా ఎత్తుకు కట్టించాడు. మరికొద్ది కాలానికి మరి కాస్త పెరగడంతో వీరబాబు గోడను మరి కాస్త ఎత్తుకు కట్టించాడు.
సంవత్సర కాలం కూడా గడవడంతో ఇప్పుడది పూతకి వచ్చింది. తెల్లటి పూత గుత్తులు గుత్తులుగా చెట్టంతా విరగబూసింది. ఆ దృశ్యం కన్నులపండుగలా ఉంది వీరబాబుకి. అయితే అంతలోనే మరో అనుమానం వచ్చింది. చెట్టు ఎత్తుకు ప్రహరీ గోడ ఉన్నా బయటి నుంచి వెళ్లేవాళ్లకి పండ్లు కనిపించే అవకాశం ఉంది.
అందుకు బయట నుంచి రాళ్లు వేసి కొట్టి కాయలు పాడుచేస్తే, సరైన ఆదాయం రాదని భావించి చెట్టుపైన కూడా తాటి ఆకులతో పందిరిలా వేయించాడు.
దాంతో చెట్టుకి గాలీ, వెలుతురూ రాక కొద్ది రోజులకే పూత అంతా రాలిపోయింది. పూలుకాయలై, పండ్లు అవుతాయని ఆశ పడిన అతనికి నిరాశే మిగిలింది. ఆపై అన్నగారిపై కోపం కూడా వచ్చింది.
తనకి ఆదాయం రావడం అన్నగారికి ఇష్టం లేదని… సరిగా కాయని మొక్కని తనకి ఇచ్చాడని భావించి అన్నగారిని పిలిపించాడు.
‘అన్నయ్యా! అడిగాను కదా! అని సరిగా కాయని మామిడి మొక్కని నాకు అంటగడతావా? చూడు పూత ఎలా రాలిపోయిందో! నీ మొక్కలు చక్కగా కాయలు కాస్తున్నప్పుడు నా చెట్టే ఎందుకు కాయకపోవాలి?’ అడిగాడు కోపంగా.
పరిస్థితిని గమనించిన దొరబాబు ‘తమ్ముడూ! మొక్కలు ప్రకృతిలో సహజ సిద్ధంగా పెరిగేవి. వాటికి గాలీ, వెలుతురూ బాగా తగలాలి. బయట ఎవరో నీ చెట్టుకి ఉన్న పండ్లు కోసుకుపోతారని నీ ఇంటి ప్రహరీ గోడ ఎత్తు పెంచి, పైన పందిరి కూడా వేయించావు. దాంతో చెట్టుకి గాలీ వెలుతురూ అందక పూత రాలిపోయింది. నీ తెలివి తక్కువతనం వల్ల ఏడాది పంటను నష్టపోయావు. అంతే తప్ప మొక్కలో ఏ లోపమూ లేదు’ అంటూ వివరించాడు.
దాంతో వీరబాబుకి తన తప్పు తెలిసి వచ్చింది. తనూ వ్యవసాయదారుడే అయినా ప్రకృతిని సరిగా అవగాహన చేసుకోనందుకు తన తెలివి తక్కువతనానికి సిగ్గుపడ్డాడు. 

129 total views, 3 views today