మంచి నేర్చుకో

మంచి నేర్చుకో

February 6, 2019 Off By nuzvidthemangocity

ఒక అడవిలో బాదం చెట్టుపై రామ చిలుక గూడు కట్టుకుని నివాసముండేది. కొంతకాలానికి దానికో పిల్ల పుట్టింది. దానికి వూహవచ్చేసరికి ప్రకృతి అంతా వింతగా, తనతోపాటు నివసించే పక్షుల చర్యలు విచిత్రంగానూ అనిపించ సాగాయి.

అలాగే చెట్టు కింద తిరుగాడే జంతువుల చేష్టల్ని కూడా విడ్డూరంగా చూడటం మొదలెట్టింది. అప్పుడు పిల్ల చిలుకకు ఒక సందేహం వచ్చింది. తను ఏ ప్రవర్తనను అనుసరించాలో అర్థం కాలేదు. ‘అమ్మా! నేను ఎవరితో స్నేహం చేయాలో? ఎవరి నుంచి ఏం నేర్చుకోవాలో నాకు తెలీదు. దానికి నేనేం చేయాలి.’ అని అడిగింది అమాయకంగా.

‘ఎవరితో స్నేహం చేసినా మంచిని నేర్చుకో’ అని సలహా ఇచ్చింది తల్లి చిలుక.

‘అదెలా తెలుస్తుంది?’ అని తిరిగి అడిగింది పిల్ల చిలుక.

‘ఓసి పిచ్చి మొహమా! అది నీకు అనుభవం మీద తెలుస్తుంది’ అని చెప్పింది తల్లి.

తల్లి మాటలు అర్థం కాకపోయినా సరే.. సరేనంది. ఆ మర్నాడే చిన్ని చిలుకకి చెట్టుపైకి ఎక్కి కూర్చున్న కోతి కనిపించింది. కోతితో స్నేహం చేస్తానంది. దానికి కోతి ‘అయితే నా వీపుపైకి ఎక్కి కూర్చో’ నీకు నా చేష్టలు ఎన్నో చూపిస్తాను’ అని తన వీపుపైకి ఎక్కించుకుంది. కోతి గుడి దగ్గరకు తీసుకెళ్లింది. అక్కడ చేరిన యాత్రికుల చేతిలో ఉన్న అరటిపండ్లను, కొబ్బరి ముక్కలను గభాలున లాగేసుకుని చెట్టుపైకి ఎగిరి కూర్చుంది.

‘చూశావా! నా నేర్పరితనం? ఎంచక్కా కష్టపడకుండానే తినడానికి తిండి దొరికింది’ అని చిలుకకు అరటి పండ్లు ఇచ్చింది. వాటిని తింటూ ‘భలే భలే! నీలాగైతే ఏరోజూ తిండికి కొదవుండదు’ అని కోతితో పాటు తన చెట్టు దగ్గరకి చేరిపోయింది.

మరో రోజున చెట్టు కింద చీమల బారు కనిపించింది. వాటిని చూసి కిందకు దిగిన పిల్ల చిలుక ‘అదేంటి? మీరంతా ఎవరిమట్టుకు వాళ్లు పోకుండా కలిసికట్టుగా యుద్ధానికి బయలుదేరినట్లుగా వెళ్తున్నారు?’ అని అడిగింది సందేహంగా.

‘అది మా చీమల్లో ఉండే నియమం. మేం ఆహార సంపాదనకు ఒకరి వెంట ఒకరం వెళ్లి సేకరించుకుని వస్తాం. మాకు నివాసానికి పుట్టలు ఏర్పరుచుకుంటాం’ అని చెప్పింది ఓ గండుచీమ.

‘ఆహారం కోసం, నివాసానికి ఇంత కష్టపడ్డం అవసరమా? మీవి పిచ్చి పనుల్లా ఉన్నాయి’ అని కిసుక్కున నవ్వి మళ్లా చెట్టుపైకి చేరిపోయింది.

అలా ఆలోచిస్తున్న సమయంలోనే చెట్టు బెరడును చీలుస్తున్న చప్పుడుకి అటువైపు తిరిగింది పిల్ల చిలుక.

ఒక వండ్రంగి పిట్ట చెట్టు మీదకెక్కి అదేపనిగా పొడుస్తూ ఉంది. అది చూసి దగ్గరగా వెళ్లి ‘అయ్యో రామ! ఎందుకలా నీ ముక్కంతా పాడుచేసుకుంటున్నావ్‌?’ అని ఎగతాళిగా చూసింది.

‘కాదు. చెట్టు బెరడు తొలిచి పురుగుల్ని తింటున్నా! అంతేకాదు నా పిల్లలక్కూడా ఆహారాన్ని అందిస్తున్నా!’ అంది వడ్రంగి పిట్ట.

‘తిండి కోసం ఎందుకింత బాధలు పడ్డం? నీ పని అర్థం లేనిదిగా అనిపిస్తోంది’ అని ఫక్కున నవ్వి ఎగిరిపోయింది.

ఇంకొన్ని రోజులు గడిచాక ఓ కాకి చిలుక ఉండే చెట్టుపైకి వచ్చి కూర్చుంది. ముద్దుగా ఉన్న పిల్ల చిలుకను చూసి పలకరించి ‘నాతో స్నేహం కావాలంటే నాతో రావాలి!’ అని షరతు పెట్టింది. అలాగేనంటూ కాకితో బయలుదేరింది పిల్ల చిలుక.

కాకి ఎగురుతూ ఇళ్లపై వాలి కిందకు చూస్తూ నేలపై ఎవరైనా ఆహార పదార్థాలు ఎండబెట్టుకుని ఉంటే వాటిని నోట కరచుకుని వచ్చి తింటూ చిలుకకు కూడా ఇవ్వ సాగింది. అయితే అదే సమయంలో చెట్టు కింద తిరుగాడే మనుషులపైన రెట్ట వేయడం వాళ్లు మీదకి చూసి చిరాకు పడుతుంటే నవ్వడం చేసేది. చిలుకకు కాకి చేష్టలు గమ్మత్తుగా అనిపించి తను కూడా కాకిలాగే నేలపైన తిండి గింజలను కరచుకొని రావడం, ఆపైన మనుషులపైన రెట్టవేయడం మొదలెట్టింది. ఎవరో ఒకరు అది చూసి కాకితో పాటు చిలుకపైకి రాయి విసిరారు. కాకి నేర్పుతో తప్పించుకుని ఎగిరిపోగా, పిల్ల చిలుక మాత్రం తప్పించుకోలేక రాయి దెబ్బకి కిందపడిపోయింది. అదృష్టవశాత్తూ అటు నుంచి గూటికి తిరిగి వస్తున్న తల్లి రామ చిలుక తన పిల్ల ఆపదలో ఉండటం చూసి వెంటనే నోట కరచుకుని తీసుకుపోయి తగిన చికిత్స చేసి కాపాడింది.

జరిగిందంతా పిల్ల చిలుక ద్వారా తెలుసుకున్న రామచిలుక ‘ఇక్కడ నువ్వు కొన్ని సంగతులు తెలుసు కోవాలి. కోతిలాగ పిచ్చి పనులు చేస్తే ఎవరూ సహించరు. చీమల్లా కష్టపడితే ఎవరిచేతా నింద పడక్కర్లేదు. వండ్రంగి పిట్టలాగ ఎవరి పనితనంతో వారు ఎలాగైనా ఆహారం సంపాదించుకోవచ్చు. కాకిలాగ చెడు బుద్ధితో ప్రవర్తిస్తే చివరికి ఆపదలో చిక్కుకుంటారు. ఇక ఎవరితో స్నేహం చేసినా మంచిని గుర్తించి నడవడికను అలవాటు చేసుకో. చెడు తెలుసుకొని అది విడిచి పెట్టేయాలి. ఈ నిజం తెలుసుకుంటే బతకడం సులువు.’ అని పిల్లకు వివరించి చెప్పింది. ఆ తర్వాత నుంచీ పిల్ల చిలుక తోటివారి నుంచి దేన్ని నేర్చుకోవాలనే విషయంలో జాగ్రత్తగా మసలసాగింది.