కాకిలెక్కలు!

కాకిలెక్కలు!

February 5, 2019 Off By nuzvidthemangocity

పూర్వం ధర్మపురి రాజ్యాన్ని నృసింహశర్మ అనే రాజు పరిపాలించేవాడు. ఆయనకు అప్పుడప్పుడు కొత్త కొత్త అలోచనలు వస్తుండేవి. ఆ ఆలోచనలకు తగ్గట్టు వాటిని కార్యరూపంలోకి పెట్టేవాడు. ఒక్కోసారి అవి మరీ వెర్రి ఆలోచనల్లా ఉండేవి. 
* ఒకసారి ఆయనకు తన రాజ్యంలో కాకుల లెక్క ఎంతో తెలుసుకోవాలన్న కోరిక కలిగింది. తన ఆలోచనను మంత్రికి చెప్పాడు. మంత్రి వెంటనే తమ రాజ్యంలో ఎన్ని కాకులున్నాయో లెక్కపెట్టమని ఒక అధికారిని నియమించాడు. అతడు తనకు కొంత వ్యవధి కావాలన్నాడు. కొన్ని రోజుల తర్వాత అతడు కాకుల సంఖ్యను చెప్పాడు. మంత్రి రాజుకు దానిని నివేదించాడు. 
* కాని.. రాజుకు అతడిచ్చిన సంఖ్య మీద నమ్మకం కలగలేదు. తనే స్వయంగా మరొక అధికారిని నియమించాడు. ఆ అధికారి కొన్ని రోజుల తర్వాత తాను లెక్కించిన కాకుల సంఖ్యను తెలియజేశాడు. రాజుకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే మొదటి అధికారి ఇచ్చిన సంఖ్యకు, రెండవ అధికారి ఇచ్చిన సంఖ్యకు చాలా తేడా ఉంది. 
* వెంటనే ఈ సంగతి మంత్రికి తెలిపిన రాజు మరొక అధికారికి ఈ బాధ్యత అప్పగించాడు. అతడు కూడా తాను లెక్కించిన కాకుల సంఖ్యను రాజుకు తెలియజేశాడు. ఈసారి కూడా రాజు చాలా ఆశ్చర్యపోయాడు. మూడుసార్లు వేసిన కాకి లెక్కలకు పొంతన లేదు. 
* పట్టు వదలని రాజు తన భవన ప్రాంగణంలో కొంత ధాన్యం చల్లించాడు. మర్నాడే అక్కడికి కొన్ని కాకులు వచ్చి ధాన్యాన్ని తినసాగాయి. అప్పుడు రాజు వాటిని లెక్కించాడు. అవి ‘ఇరవై ఎనిమిది’ ఉన్నాయి. మరో రోజు ఇలాగే ధాన్యాన్ని చల్లించాడు. మళ్లీ కాకులు వచ్చాయి. వాటిని లెక్కించాడు. అవి ‘పదిహేను’ మాత్రమే ఉన్నాయి. ఆ మూడోరోజు ‘ఇరవై’ కాకులున్నాయి. రాజుకు తల తిరిగింది. తన మేడలోని కాకుల సంఖ్యే సరిగా లేదు. అలాంటిది తన రాజ్యంలోని కాకుల సంఖ్య ఎలా సరిగ్గా ఉంటుంది? అని తన మనసును సమాధానపరుచుకున్నాడు. అందుకే లెక్కలు సరిగా లేనప్పుడు ‘కాకి లెక్కలు’ అన్న పేరు లోకంలో నానుడిగా మారిందని పెద్దలు అంటారు.

58 total views, 3 views today