చెరపకురా చెడేవు!

చెరపకురా చెడేవు!

February 1, 2019 Off By nuzvidthemangocity

రంగాపురం జమీందారీని నారాయణరావు అనే జమీందారు పాలించేవాడు. అతని ఏలుబడి కింద గువ్వలపాలెం అనే పల్లె ఉండేది. అక్కడ జమీందారుకు వంద ఎకరాల తోట ఉంది. ఆ తోటలో రకరకాల పండ్ల చెట్లు ఉన్నాయి.తోటను చూసుకోవడానికి జమీందారు ఇద్దరు కూలీ నాయకులు శీనయ్య, భీమయ్యలను నియమించాడు. 
భీమయ్య నిజాయితీపరుడే కానీ ఆవేశం ఎక్కువ. శీనయ్య జిత్తులమారి. భీమయ్య పర్యవేక్షణ చేయడమేకాక అవసరమైనప్పుడు కూలీలతో పాటు కష్టపడి పనిచేస్తాడు. శీనయ్య దీన్ని ఒప్పుకోడు. మన పని మాత్రమే చేస్తే చాలు అంటాడు. అంతేకాదు తోటలో పండే పండ్లను కాజేస్తుంటాడు శీనయ్య. భీమయ్య అలా చేయడు పైగా పనుల విషయంలో కచ్చితంగా ఉండటం వల్ల పనిదొంగలైన కూలీలకూ చెడ్డవాడయ్యాడు. ఇలా ఇద్దరికీ కొన్ని విషయాల్లో విభేదాలు తలెత్తాయి. భీమయ్య ఆవేశంతో అందరిముందూ గొడవపడేవాడు. శీనయ్య తెలివిగా సర్దుకునేవాడు. కానీ సమయం వచ్చినప్పుడు కుతంత్రాలు చేసేవాడు. ఎలాగైనా సరే భీమయ్యను తోటలో లేకుండా చేస్తే తనకు అడ్డు ఉండదని శీనయ్య భావించేవాడు. 
ఒకరోజు జమీందారీ నుంచి పన్ను వసూలు చేయడానికి రామాచారి అనే అధికారి వచ్చాడు. అతడు జమీందారుకు సన్నిహితుడు. శీనయ్య ఇదే సరైన సమయం అని భావించాడు. 
రామాచారికి ఆతిథ్యమిచ్చి సకల మర్యాదలు చేశాడు. తనకు మచ్చికైన కూలీలతో భీమయ్యపై చాడీలు చెప్పించాడు. రామాచారి అంతా విని వెళ్లిపోయాడు. నాలుగు రోజుల తర్వాత భీమయ్యని అక్కడి నుంచి మరొక చోటికి బదిలీ చేస్తూ ఉత్తర్వు వచ్చింది. భీమయ్య వెళ్లిపోయాడు. శీనయ్య సంతోషంతో గంతులు వేశాడు. అయితే శీనయ్య సంతోషం ఎక్కువ రోజులు నిలువలేదు. భీమయ్య వెళ్లిపోయాక అతని స్థానంలో యజమాని ఎవర్నీ నియమించలేదు. దాంతో ఇద్దరి పని శీనయ్యే చూసుకోవాల్సి వచ్చింది. పైగా జమీందారీ నుంచి ఒక ఉద్యోగి ప్రతివారం వచ్చి లెక్కాజమలు చూసే ఏర్పాటు చేయడంతో శీనయ్య పైన మిగుల్చుకునే డబ్బులకూ అవకాశం లేకుండా పోయింది. కొంత కాలానికి శీనయ్యకి అర్థమయ్యింది ఒకరికి చెడు చేయాలని చూస్తే అది మనకే ఎదురవుతుందని.

70 total views, 3 views today